: ఎప్పట్లా తన్నలా... మా వాళ్లు చాలా ప్రొఫెషనల్ గా పని చేశారు: విజయవాడ సీపీ
ఎప్పట్లా ఎవరో ఒకర్ని తీసుకొచ్చి తన్ని నిజాలు రాబట్టే ప్రయత్నం చేయలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, యాసిడ్ దాడి నిందితులను గుర్తించడంలో విజయవాడ పోలీసులు అత్యుత్తమ వృత్తినైపుణ్యం ప్రదర్శించారని అన్నారు. నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ఆ గ్రామం వెళ్తే...గ్రామంలో మంచి పేరున్న యువకులను ఎందుకు తీసుకెళ్తున్నారని అడ్డుకున్నారని, వారికి అనుమానం రాకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా నిందితులను తీసుకొచ్చి విచారణ చేయించామని ఆయన తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని, ఆయన చేతులు కాలి ఉండడంతో తమ అనుమానం బలపడిందని ఆయన చెప్పారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. రెండు రోజుల క్రితం ప్రియుడిపై యాసిడ్ దాడి చేయించే ప్రయత్నంలో ఓ యువతి ప్రమాదవశాత్తు గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలోనే ఆ యువతి ప్లాన్ ప్రకారం వచ్చిన నిందితులను అరెస్ట్ చేశారు.