: డిస్నీ వరల్డ్ పార్కుల్లో 'సెల్ఫీ స్టిక్స్'పై నిషేధం!
డిస్నీ వరల్డ్ పార్కులకు వెళ్లినప్పుడు సెల్ఫీ స్టిక్స్ తీసుకోని వారుండరు. అయితే ఇప్పుడు అనేకమందికి నిరాశ మిగలనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ పార్కుల్లో సెల్ఫీ స్టిక్స్ ను నిషేధించాలని వాల్ట్ డిస్నీ తాజాగా నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, పెద్దవారిని సహా ఆకట్టుకునే విధంగా పలు దేశాల్లో డిస్నీ పార్కులు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిల్లో సెల్ఫీ స్టిక్స్ ను అనుమతించకూడదని ప్రకటించారు. సందర్శకులకి ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతోనే నిషేధం విధించినట్టు డిస్నీ తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం... ఇటీవల రోలర్ కోస్టర్ లో తిరుగుతుండగా ఓ వ్యక్తి తన సెల్ఫీ స్టిక్ ను విసిరేశాడట. దాంతో కోస్టర్ గంటపాటు నిలిచిపోయిందట. దానివల్లే ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సెల్ఫీలు తీసుకోడానికి ప్రత్యేకంగా రూపొందించిన పరికరమే సెల్ఫీ స్టిక్. లోహంతో తయారైన ఈ స్టిక్ దాదాపు 40 అంగుళాల పొడవు ఉంటుందట. సాధారణంగా స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్స్, క్యాంపాక్ట్ కెమెరాలను ఈ స్టిక్స్ కి అమర్చి ఫోటో తీసుకోవచ్చట. ఎప్పుడూ తీసుకునే సెల్ఫీ కన్నా ఈ స్టిక్ ఎక్కువ ప్రదేశాన్ని చిత్రీకరిస్తుందట. దాంతో సెల్ఫీలో ఎక్కువమంది రావడంతో పాటు వెనుక ఉండే ప్రదేశం కూడా కనిపించడమే దాని ప్రత్యేకత.