: కేసీఆర్ ఆటలో స్టీఫెన్ ఓ పావు మాత్రమే... కేసీఆర్ ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి: టీడీపీ
స్టీఫెన్ సన్ వేసిన పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా... కోర్టు ధిక్కరణకు స్టీఫెన్ పాల్పడ్డారని, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టు ఆదేశించడంపై టీడీపీ స్పందించింది. న్యాయవ్యవస్థపైనే ఆరోపణలు చేయడం ఎంతటి దుస్సాహసమో టీఆర్ఎస్ తెలుసుకోవాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు నచ్చని సంస్థలు, వ్యవస్థలు ఉండరాదని కేసీఆర్ భావిస్తారని, అది ప్రజాస్వామ్యంలో చెల్లదని చెప్పారు. కేసీఆర్ ఆటలో స్టీఫెన్ కేవలం ఒక పావు మాత్రమే అని అన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే, వరంగల్ నుంచి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయాలని తమ మిత్రపక్షం బీజేపీ కోరుతోందని... ఈ విషయంపై తమ అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పారు.