: ఇ-ఫైల్ ద్వారా స్వయంగా ఆదాయపు పన్ను రిటర్నులను ఎలా దాఖలు చేయాలంటే...
మీరు ఆదాయపు పన్ను శ్లాబ్ లో ఉన్నారా? రిటర్నులను ఇ-ఫైలింగ్ విధానంలో దాఖలు చేస్తున్నారా? కొన్ని చిన్న చిన్న విషయాలను తెలుసుకుని జాగ్రత్తపడితే, మరింత సులువుగా పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నెలవారీ వేతనం నుంచి టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) కట్ చేసుకున్న యాజమాన్యం మీకిచ్చే సర్టిఫికెట్ 'ఫాం 16' రిటర్నుల దాఖలులో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాజమాన్యం పాన్, టాన్ వివరాలు ఉంటాయి. మీ వేతనంలో పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం ఎంతన్న వివరాలు ఉంటాయి. ఫాం-16ను సులువుగా అప్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పిస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకున్న ఇతర ఆదాయమెంత అన్న వివరాలు స్పష్టంగా ఉండాలి. మీకున్న సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై ఎంతో కొంత వడ్డీ రూపంలో లభిస్తుంది, లేదా ఫిక్సెడ్ డిపాజిట్లు మెచ్యూర్ అయి వుంటాయి. వీటిని చాలా మంది మరచిపూతుంటారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం విభాగంలో వీటిని చూపిస్తూ, రిటర్నులు దాఖలు చేయాలి. డిపాజిట్లు, బాండ్లు ఇలాంటివి ఏవున్నా వాటి నుంచి వచ్చిన వడ్డీ బ్యాంకు స్టేట్ మెంట్ లో కనిపిస్తుంది. వీటిని రిటర్నులుగా చూపించుకోవచ్చు. మీరేదైనా గృహ రుణం తీసుకున్నట్లయితే, మీరు అదే ఇంటిలో నివసిస్తుంటే, ఆ రుణంపై చెల్లిస్తున్న వడ్డీని ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన డిడక్ట్ చేసుకోవచ్చు. వడ్డీ రూపంలో కోల్పోతున్న మొత్తం మీ వేతనం, ఇతర ఆదాయంలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మీ ఇంటిని అద్దెకు ఇచ్చి వుంటే, అద్దె రూపంలో వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. దీని నుంచి 30 శాతం వరకూ ఆస్తి పన్ను రూపంలో రిటర్న్ గా పొందవచ్చు. సెక్షన్ 80సి, సెక్షన్ 80యు ప్రకారం ఏమైనా డిడక్షన్స్ పొందవచ్చో ఒకసారి గమనించాలి. దీని వల్ల స్థూల ఆదాయాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవడం ద్వారా, తక్కువ పన్ను భారం పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు పనిచేసే సంస్థ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా కూడా, క్లయిములు చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు పీపీఎఫ్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేశారనుకోండి లేదా బీమా ప్రీమియంలు చెల్లించారనుకోండి, దీన్ని ఎంప్లాయర్ కు తెలియజేయాల్సిన అవసరం ఉండదు. వైద్య బీమా ప్రీమియంలు వంటి వాటికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి, 80జి కింద మినహాయింపులు ఉంటాయి. మీరిస్తున్న సమాచారమంతా కచ్చితంగా ఉండేలా చూసుకోండి. పాన్ నెంబరు, ఈమెయిల్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర సమాచారం సరిగ్గా ఉండేలా చూడాలి. చివరిగా, అన్ని వివరాలూ పొందుపరిచిన తరువాత మరోసారి పరిశీలించుకోవడం మంచిది. మీరు 'టాక్స్ డ్యూ' పరిధిలో ఉన్నట్లయితే, పన్ను చెల్లించిన తరువాతనే ఇ-ఫైలింగ్ చేయగలుగుతారని మరవద్దు. ఇ-ఫైలింగ్ విజయవంతంగా ముగించాలంటే, ఐటీఆర్-వీ పంపాలి. దీన్ని ప్రింటవుట్ తీసుకుని, సంతకం పెట్టి బెంగళూరులోనీ సీపీసీకి ఆధార్ కార్డు వివరాలను జతచేసి పంపాల్సి వుంటుంది. చివరిగా చేసే ఈ పని అత్యంత ముఖ్యమైనది.