: ఆత్మహత్యకు సిద్ధమైన ప్రేమికులు... ప్రియురాలిని చంపి పోలీసులకు లొంగిపోయిన ప్రియుడు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియురాలి గొంతు కోసి ఆమెను హతమార్చిన ప్రియుడు తాను మాత్రం ఏమీ చేసుకోకుండా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లాల్ బాగ్ కు చెందిన ప్రసాద్ సావంత్ (26), లోవర్ పారెల్ కు చెందిన ఏక్తా తల్వాద్కర్ (24)లు గత 11 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో చనిపోవాలన్న ఉద్దేశంతో నిన్న రాత్రి కళాచౌకీ సమీపంలో కలుసుకున్నారు. ఆ సమయంలో మద్యం సేవించిన ప్రసాద్ ప్రియురాలి గొంతును పదునైన కత్తితో కోశాడు. ఆపై పోలీసు స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న ఏక్తాను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె ప్రాణాలు పోయినట్టు వైద్యులు తెలిపారు. ప్రసాద్ పై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రసాద్ మంచివాడు కాదని తాను నమ్మబట్టే వారి పెళ్లికి నిరాకరిస్తూ వచ్చినట్టు ఏక్తా తండ్రి అంకుష్ వాపోయారు.