: ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమంటూ, ప్రిన్సిపాల్ ను కొట్టి చంపేసిన నిరసనకారులు
ఫీజులు సమయానికి చెల్లించలేదన్న కారణంతో ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపాల్ కొట్టి చంపేశాడని ఆరోపిస్తూ, నిరసనకారులు ప్రిన్సిపాల్ ను నడిరోడ్డుపై చంపేశారు. ఈ దారుణ ఘటన బీహార్ లోని నలంద జిల్లాలో జరిగింది. పాఠశాల పక్కనున్న మురికి గుంటలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావడంతో వారి బంధువులు, చుట్టుపక్కల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి స్కూల్ ప్రిన్సిపాల్ దేవేంద్ర ప్రసాద్ కారణమంటూ ఆయనపై దాడి చేశారు. చావగొట్టారు. పోలీసులు కలుగజేసుకునే సరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కొన ఊపిరితో ఉన్న దేవేంద్రను పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించగా, ఆయన మృతి చెందాడు. దేవేంద్రను చితగ్గొడుతున్న దృశ్యాలను పలు టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. ఆయన్ను నిర్దయగా కర్రలతో కొడుతూ, కాళ్లతో తొక్కుతున్న దృశ్యాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అంతకుముందు 7, 8 ఏళ్ల వయసున్న రవి కుమార్, సాగర్ కుమార్ ల మృతదేహాలు ఓ మురికి కాలువలో కనిపించాయి. వీరిని ప్రిన్సిపాల్ హింసించి చంపాడని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్కూలుపై దాడి చేసి తరగతి గదుల్లోని ఫర్నీచరును, వాహనాలను తగులబెట్టారు. పోలీసులపైనా రాళ్లదాడి చేశారు. టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.