: సింగిల్ విండో ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్...రెండు చోట్లా ప్రత్యర్థులదే విజయం
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఏడాది తిరిగేసరికే షాక్ కొట్టేసింది. కరీంనగర్ జిల్లాలోని రెండు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు చోట్లా ఆ పార్టీ ప్రత్యర్థులే విజయం సాధించారు. జిల్లాలోని హుస్నాబాద్, ముల్కనూరు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నేత బొలిశెట్టి శివయ్య విజయం సాధించగా, ముల్కనూరు సింగిల్ విండోలో ఐదు డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది.