: ‘పరిటాల’ వారసుడు ‘మిచిగాన్’ మేనేజ్ మెంట్ పట్టా పుచ్చుకున్నారు!


‘పరిటాల’ పేరు వింటేనే ‘ఫ్యాక్షన్’ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) నుంచి వచ్చి ఏపీ రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దివంగత పరిటాల రవి ‘ఫ్యాక్షన్’కు బలయ్యారు. దాంతో, అప్పటిదాకా ఇంటికే పరిమితమైన ఆయన సతీమణి పరిటాల సునీత, తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె కూడా ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఎదిగారు. పరిటాల సునీత పెద్ద కొడుకు శ్రీరామ్ కూడా దాదాపుగా రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. వీరిందరికీ చదువు పెద్దగా అబ్బలేదన్న వాదన ఉంది. అయితే, ఈ వాదనను పరిటాల సునీత రెండో కుమారుడు పరిటాల సిద్ధార్థ పటాపంచలు చేశారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో మేనేజ్ మెంట్ కోర్సును దిగ్విజయంగా పూర్తి చేశారు. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన సదరు కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పరిటాల సునీత తన పెద్ద కొడుకు శ్రీరామ్ తో కలిసి హాజరయ్యారు. డిగ్రీ సాధించిన కొడుకుతో గర్వంగా ఫొటోలకు ఫోజిచ్చారు.

  • Loading...

More Telugu News