: సెన్సార్ బోర్డు సభ్యులు రూ.2 లక్షలడిగారు... ‘పాకశాల’దర్శక నిర్మాతల సంచలన ప్రకటన
ఇప్పటికే అవినీతి ఊబిలో కూరుకుపోయిన సెన్సార్ బోర్డుపై తెలుగు సినిమా నిర్మాతలు మరోమారు అవినీతి ఆరోపణలు గుప్పించారు. తమ సినిమాకు క్లియరెన్స్ కావాలంటే, రూ.2 లక్షలు ఇవ్వాల్సిందేనని సెన్సార్ బోర్డు సభ్యులు డిమాండ్ చేశారని ‘పాకశాల’ నిర్మాతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ చిత్ర నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. తమ సినిమా సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతూ అనుమతి నిరాకరించిన సెన్సార్ బోర్డు సభ్యులను పరిష్కారం చూపమని కోరితే, ‘‘అన్నీ మేం ఎలా చెబుతాం? మీరు మేనేజ్ చేసుకోవాలి’’ అని చెప్పడమే కాక రూ.2 లక్షలు డిమాండ్ చేశారని ‘పాకశాల’ దర్శకుడు ఫణికృష్ణ ఆరోపించారు. ఇక సినిమా ప్రివ్యూ చూసిన ఐదుగురు అధికారులు టీ, స్నాక్స్ ఖర్చులకు రూ.5 వేలు లాగేశారని సదరు చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్ కిరణ్ వాపోయారు.