: రాజన్ అలా అనలేదట... ‘మాంద్యం’ వ్యాఖ్యలపై ఆర్బీఐ వివరణ
1930 నాటి మహా మాంద్యం ముప్పు పొంచి ఉందన్న రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎందుకంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త హోదాలో 2008 నాటి మాంద్యంపై ఆయన చేసిన ముందస్తు హెచ్చరికలు నిజమయ్యాయి. దీంతో గడచిన మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అలజడి మొదలైంది. అయితే మూడు రోజుల క్రితం రాజన్ చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న ఓ ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి యూరో జోన్ లో సంక్షోభం ఉన్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నగా గాడిలో పడుతోందట. ఎటొచ్చీ తమ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న ద్రవ్య విధానాలు, 1930లలో మాదిరి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేలా ఉన్నాయని మాత్రమే రాజన్ ఆందోళన వ్యక్తం చేశారట. అయితే మీడియా రాజన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, మరోసారి 1930 నాటి సంక్షోభ పరిస్థితులు తలెత్తనున్నాయని వార్తలు రాసేసిందట.