: నరసింహన్ గవర్నర్ గా సరిపోరు...‘స్వామీజీ’గా అయితే సరిపోతారు!: రాజ్ నాథ్ కు వీహెచ్ లేఖ!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ పదవికి ఏమాత్రం సరిపోరట. స్వామీజీగా అయితే ఆయన సరిగ్గా సరిపోతారట. ఈ మేరకు నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సెలవిచ్చారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై అంతగా దృష్టి సారించని నరసింహన్, గుళ్లూ గోపురాలు పట్టుకుని తిరుగుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయా ఆలయాలకు వస్తున్న భక్తులను నరసింహన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా హన్మంతన్న ఆరోపించారు. ఈ మేరకు నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వీహెచ్ లేఖ రాశారు. ‘‘గవర్నర్ హోదాలో నరసింహన్ ఎన్నెన్ని గుళ్లు, ఎన్నెన్నిసార్లు తిరిగారో పరిశీలించండి. గుళ్లు గోపురాలు తిరిగే నరసింహన్, గవర్నర్ గా కంటే స్వామిజీగా అయితే సరిగ్గా సరిపోతారు’’ అంటూ ఆ లేఖలో వీహెచ్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు చెబుతున్నది వినడం తప్ప సమస్య పరిష్కారం దిశగా గవర్నర్ చర్యలు చేపట్టడం లేదని కూడా సదరు లేఖలో ఆయన రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఉదాసీన వైఖరి కారణంగానే నిన్నటిదాకా హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న సీమాంధ్రులు, తాజాగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తానే ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చానని, సర్వాధికారాలు తనవేనన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోకుంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని కూడా వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News