: ఆనాడు గత్యంతరం లేక 'సెక్షన్-8'కు ఒప్పుకున్నాం: కోదండరాం
ఎలాగైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఏకైక కోరికతోనే ఆనాడు 'సెక్షన్-8'కు అంగీకరించామని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. విభజన తరువాత హైదరాబాదులో ప్రజల మధ్య సఖ్యత పెరిగిందని, ఇప్పుడిక సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసు తప్పుడు కేసుగా భావిస్తే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీకి ఆయన సలహా ఇచ్చారు. ఓటుకు నోటుకు, సెక్షన్-8కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదుపై అధికారముంటే కేసు నుంచి సులువుగా బయటపడవచ్చనే ఉద్దేశంతోనే సెక్షన్-8ను డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం ముందడుగు వేయబోదనే భావిస్తున్నామని, ఒకవేళ సెక్షన్-8 అమలుకు ప్రయత్నిస్తే జేఏసీ పోరాడుతుందని కోదండరాం స్పష్టం చేశారు.