: మనపై వారి పెత్తనమేంటి? తెలంగాణవి గిల్లికజ్జాలు... బస్సులో నుంచైనా పరిపాలిస్తా: చంద్రబాబు
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తాను ఎన్నిమార్లు విన్నవించినా, లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంత్రులు, అధికారులపై పెత్తనం చేసే అధికారం టీఎస్ సర్కారుకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాజీపడే సమస్యే లేదని అన్నారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. తొలి ఏడాదిలో సమస్యల పరిష్కారానికి మార్గం లభించకనే సెక్షన్ -8 అమలు గురించి ప్రస్తావిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని లేక, కార్యాలయాలు లేక కల్యాణ మండపాలు, హోటళ్ల కేంద్రంగా సమావేశాలు, పాలన సాగించాల్సిన దుస్థితిలో ఉన్నామని అన్న ఆయన, తాను బస్సులో కూర్చొని అయినా పరిపాలన సాగిస్తానని, దశలవారీగా అన్ని కార్యాలయాలనూ అమరావతికి తరలిస్తామని తెలిపారు.