: ఎర్రచందనం వేలానికి స్పందన కరవు
కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన ఎర్రచందనాన్ని వేలం ద్వారా విక్రయించి రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆశలు నెరవేరేలా లేవు. ఏపీ సర్కారు, అటవీశాఖ ఎంఎస్ టీసీ ద్వారా ఎర్రచందనం విక్రయానికి నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరవైంది. మొదటి దశలో 1,400 టన్నుల ఎర్రచందనం అమ్మకం కోసం నిర్వహించిన టెండర్లలో 1100 టన్నులకు టెండర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండో విడతలో భాగంగా ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకూ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. రెండో దఫా టెండర్లలో పాల్గొనేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు టెండర్లను ఆహ్వానించగా, కేవలం 1300 టన్నులకు మాత్రమే టెండర్లు వచ్చాయి. రెండో విడత వేలంలో మంచి నాణ్యత ఉన్న దుంగలు ఉండడంతో, మొత్తం ఎర్రచందనం అమ్ముడవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అనుకున్నంత స్పందన లేకపోవడంతో మరోమారు టెండర్లను పిలవాలని అధికారులు భావిస్తున్నారు.