: మందుకొట్టి పోలీసులకే టోకరా ఇవ్వబోయిన మహిళ
మద్యం సేవించి వాహనాలు నడపడమే కాకుండా, పోలీసుల తనిఖీకి సహకరించని సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, అందునా హై ప్రొఫైల్ కుటుంబాలకు చెందిన వారు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. గత రాత్రి హైదరాబాదు, జూబ్లీహిల్స్ సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ అమ్మాయి చుక్కలు చూపింది. తాగి కారు నడపడమే కాకుండా, వాహనాన్ని ఆపాలని పోలీసులు కోరితే, ఆపకుండా ముందుకు దూసుకెళ్లింది. వాహనాన్ని వెంబడించిన పోలీసులు, ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించాలని కోరగా, కారు అద్దాలు బిగించుకుని కాసేపు ఇబ్బంది పెట్టింది. చివరకు మహిళా పోలీసులు వచ్చి కల్పించుకుని ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే, మోతాదుకు మించి మద్యం సేవించినట్టు వెల్లడైంది. దీంతో కారును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసును పెట్టామని పోలీసులు వెల్లడించారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఆ యువతిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.