: మీరు కొట్టుకుని చావండి, పీడ విరగడైపోతుంది... ప్రజలను పిచ్చివాళ్లను చేయొద్దు: శివాజీ
నటుడు శివాజీ మరోసారి ప్రత్యేక హోదా అంశంపై గళం విప్పారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తన ప్రాణం పోయినా ప్రత్యేక హోదా డిమాండ్ ను చావనీయనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే కేంద్ర మంత్రుల ఇళ్ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నేతలు ఇకనైనా కల్లబొల్లి మాటలు చెప్పడం కట్టిపెట్టాలని హితవు పలికారు. కొందరు ఏపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. "మీలో మీరు కొట్టుకుని చావండి, పీడ విరగడైపోతుంది... కానీ, ప్రజలను పిచ్చివాళ్లను చేయొద్దు" అని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. రాబోయే తరాల ఉసురు ఈ నేతల కుటుంబాలకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నెలరోజులుగా ఉద్యమం పక్కదారి పట్టిందని, వచ్చే నెల నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని శివాజీ చెప్పారు. ఇక, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించి స్మార్ట్ జపం చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీలు, టాయిలెట్లు అంటూ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. అంతకుముందు శివాజీ వైసీపీ అధినేత జగన్ పైనా వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పార్టీ కార్యకర్తల కోసం ఓదార్పు యాత్రలు చేస్తున్నారని, కానీ, ప్రత్యేక హోదా కోసం ఆయన ఎలాంటి యాత్రలు చేయడంలేదని అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రసారాలు చేస్తున్న మీడియాను బెదరిస్తున్నారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.