: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నన్ను బెదిరిస్తున్నారు: డాక్టర్ జాన్సన్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తనను బెదిరిస్తున్నారని జాన్సన్ అనే వైద్యుడు ఆరోపించారు. ఈ మేరకు మీడియాను ఆశ్రయించిన ఆయన హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే దాదాగిరికి సంబంధించిన వివరాలు తెలిపారు. సమ్మయ్య అనే అవినీతి అధికారిని తాను ఏసీబీకి పట్టించానన్న కోపంతో బాలరాజు తనపై కక్ష గట్టారని జాన్సన్ వివరించారు. ఆ క్రమంలో ఈ నెల 18న ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా తిట్టారని వాపోయారు. ఎమ్మెల్యే బాలరాజు దొంగలకు మద్దతిస్తున్నారని, ఆయన బెదిరింపుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సదరు వైద్యుడు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆ ఆధారాలను డీజీపీకి కూడా అందించానన్నారు. బాలరాజుపై చర్యలు తీసుకోవాలని, అవినీతి కేసులో అరెస్టైన సమ్మయ్య బెయిల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.