: ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారు క్షేమం... సీఎం రమేశ్ ప్రాజెక్టులో ఆశ్రయం
ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగానే ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. కాగా, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిలో కొందరికి జోషిమఠ్ లోని రిత్విక్ ప్రాజెక్టు ఆశ్రయం కల్పించింది. ఈ ప్రాజెక్టు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కు చెందినది. రమేశ్ ఫోన్ చేసి బాధితులకు ఆశ్రయం కల్పించాలని, వారికి సాయం చేయాలని సూచించారని ప్రాజెక్టు పర్యవేక్షకుడు గోవర్థన్ నాయుడు మీడియాకు తెలిపారు. అటు, బద్రీనాథ్, హరిద్వార్ యాత్రకు వెళ్లి ఇబ్బందుల్లో పడిన తెలుగువారిని ఇవాళ రిషికేశ్ కు తరలించి అక్కడి నుంచి ఢిల్లీ పంపిస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడ నదులు పోటెత్తుతున్నాయి.