: తమ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దంపతుల ఆత్మహత్య


తాము సన్నిహిత స్థితిలో ఉండగా రికార్డు చేసుకున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాకు చెందిన దంపతులు రాజేంద్ర జాట్ (38), రచనా జాట్ (32) నెల రోజుల కిందట ప్రయాణంలో తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. కాగా, ఆ ఫోన్ ను నలుగురు వ్యక్తులు దొరకబుచ్చుకుని అందులోని మెమరీ కార్డులో ఉన్న వీడియో క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్న విషయాన్ని బంధుమిత్రుల ద్వారా తెలుసుకున్న జాట్ దంపతులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. సమాజంలో తమ పరువు పోయిందని భావించి, ఇక బతకడం అనవసరం అనుకుని గురువారం సాయంత్రం విషపూరిత ట్యాబ్లెట్లను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అంతకుముందు, జూన్ 18న ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు కూడా. కానీ, వీడియో వ్యవహారాన్ని ఎంతో అవమానకరంగా భావించిన ఆ జంట లోకాన్ని వీడివెళ్లాలన్న తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News