: కాంగ్రెస్ నుంచి వైదొలగనున్న నందన్ నీలేకని?
ఆధార్ ప్రాజెక్టు మాజీ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనీ త్వరలో కాంగ్రెస్ ను వీడబోతున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపరిచే అంశంపై ఎంతోకాలం నుంచి ఆయన పనిచేస్తున్నారు. టెక్ ప్రాజెక్ట్ 'ఏక్ స్టెప్' అనే సామాజిక సంస్థ పేరుతో తీసుకొస్తున్న ఈ కార్యక్రమంపై నీలేకని మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఆ ఆలోచనతో పార్టీ నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకుముందునుంచే ఎంతో పేరు ప్రఖ్యాతులున్న నీలేకని, యూపీఏ-2 ప్రభుత్వంలో ఆధార్ ప్రాజెక్టుకు ప్రముఖంగా పనిచేశారు. గతేడాది లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.