: మోదీని విమర్శించి చిక్కుల్లో పడిన ఎమ్మెల్యే


ముంబయిలోని కొలాబా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడగా, దాని తాలూకు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. అనేక భాషలకు చెందిన వెబ్ సైట్లలో ఇప్పుడా వీడియో హల్ చల్ చేస్తోంది. దీనిపై మహారాష్ట్ర బీజేపీ మండిపడుతోంది. ఆ వీడియోలో... ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారని, బీజేపీలో ప్రజాస్వామ్యం లోపించిందని పురోహిత్ వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. "ప్రజలు సమష్టి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. కానీ, అది ఎక్కడా కనిపించడంలేదు. పార్టీకి ఇది ప్రమాద సంకేతం" అని పురోహిత్ ఓ వ్యక్తితో చెబుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇక, పురోహిత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను వదల్లేదు. ఆయన నిస్సహాయుడిగా మారిపోయాడని, దానికి కారణం పైనుంచి వస్తున్న ఒత్తిళ్లేనని వివరించారు. ఈ వీడియో గురించి పురోహిత్ ను మీడియా ప్రశ్నించగా... మార్ఫింగ్ చేశారని, వీడియోలో గొంతు తనది కాదని చెప్పుకొచ్చారు. అటు, రాష్ట్ర బీజేపీ శాఖ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పార్టీ నిర్ణయించిందని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ తెలిపారు.

  • Loading...

More Telugu News