: ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ నేడే... ‘అమ్మ’ భారీ మెజారిటీపై అన్నాడీఎంకే ధీమా!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోసం ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సీఎం పదవితో పాటు అప్పటిదాకా ఉన్న శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును బెంగళూరు హైకోర్టు కొట్టివేయడం, జయ తిరిగి సీఎం పీఠంపై అధిష్టించడం జరిగిపోయాయి. అయితే ఆమె రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానానికి అప్పటికే ఉప ఎన్నిక జరిగిపోయింది. దీంతో ఆర్కే నగర్ ఎమ్మెల్యే ‘అమ్మ’ కోసం రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన జయలలితపై పోటీ చేసేందుకు ప్రతిపక్షం సహా ప్రధాన పార్టీలన్నీ వెనకడుగేశాయి. దీంతో వామపక్షాల అభ్యర్థి సహా 27 మంది ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మదితిరిగేలా తనకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని జయలలిత ఆర్కే నగర్ ఓటర్లను కోరారు. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఓట్లను ఈ నెల 30న లెక్కించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. జయలలిత విజయం ఖాయమైనా, మెజారిటీ ఎంత అన్న దానిపైనే చర్చ కొనసాగుతోంది.