: సత్నాం సింగ్ ను అభినందించిన సచిన్, అమితాబ్


అమెరికాలో బాస్కెట్ బాల్ క్రీడకు విశేషాదరణ ఉంది. అక్కడి నేషనల్ బాస్కెట్ లీగ్ కాసుల వర్షం కురిపిస్తుంది. ఆటగాళ్లకు భారీ మొత్తాలు ముట్టజెబుతారు. గెలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. స్పాన్సర్లు వెతుక్కుంటూ వస్తారు. కోట్లు గుమ్మరిస్తారు. అలాంటి లీగ్ లో ఆడాలని ప్రతి బాస్కెట్ బాల్ ఆటగాడు కలలు కనడం సహజమే. ఇప్పుడా అద్భుత అవకాశం భారత్ కు చెందిన సత్నాం సింగ్ భమరా(19) కు వచ్చింది. ఈ 7 అడుగుల 2 అంగుళాల పొడగరిని డల్లాస్ మావెరిక్స్ జట్టు ఎంపిక చేసుకుంది. పంజాబ్ కు చెందిన సత్నాం ఎన్ బీఏ లీగ్ లో ఆడుతున్న తొలి భారత క్రీడాకారుడు కావడంతో అతడి పేరు మార్మోగిపోతోంది. దీనిపై భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఓ భారతీయుడు ఇంతటి ఘనత అందుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు. జాతి యావత్తూ అతనికి మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నానని, అతను రాణించాలని కోరుకుంటునట్టు తెలిపారు. ఇక, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సత్నాంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ ఎన్ బీఏ లీగ్ కు వెళుతోందని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కూడా సత్నాంను కొనియాడారు. ఏదీ అసాధ్యం కాదని నిరూపితమైందని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత యువత మరోసారి తమ సత్తా నిరూపించుకుందని తెలిపారు. బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా సత్నాంను అభినందించారు.

  • Loading...

More Telugu News