: మన మార్స్ మిషన్ కు ఢోకా లేదు: ఇస్రో
ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ కు ఉన్నత స్థానం కల్పించిన మార్స్ మిషన్ మంగళ్యాన్ కు ఢోకా లేదని, మరికొన్నేళ్లు పనిచేయగలదని ఇస్రో తెలిపింది. మన మార్స్ మిషన్ లో ఇంకా 45 కిలోల ఇంధనం మిగిలే ఉందని, తద్వారా మరింతకాలం పాటు కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అలూమ్ని గ్లోబల్ కాన్ఫరెన్స్-2015లో ఆయన మాట్లాడుతూ... ప్రయోగం మొదలుకొని కక్ష్యలో ప్రవేశపెట్టేంతవరకు ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదని, అందుకే ఇంధనం ఆదా అయిందని వివరించారు. కఠిన వాతావరణం కలిగివుండే అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం భారత్ మార్స్ మిషన్ కు రూపకల్పన చేయడం తెలిసిందే. 2013 నవంబర్ 5న శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ మార్స్ మిషన్ ను రోదసిలోకి మోసుకెళ్లింది. గతేడాది సెప్టెంబర్ 24న మార్స్ మిషన్ అంగారక కక్ష్యలో ప్రవేశించింది.