: ఆ బాలుడు తీసిన ఫొటోల్లో ఉన్నది ఫ్లయింగ్ సాసరేనా?
విశ్వం అనంతమైనది. ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలు! మానవుల వంటి బుద్ధి జీవులు సుదూర గ్రహ వ్యవస్థల్లో ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అంచనాలు వేస్తున్నారు. ఈ విషయమై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఒకవేళ ఉంటే, వారి రూపురేఖలు ఎలా ఉంటాయి? వారూ మనలాంటి వారేనా?... ఇలా ఏలియన్ల గురించి ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచంలో పలు చోట్ల, ముఖ్యంగా అమెరికాలో గ్రహాంతర వాసుల వాహనాలుగా భావించే ఫ్లయింగ్ సాసర్స్ ను చూశామని ఎందరో పేర్కొన్నారు. కొందరు వాటి ఫొటోలను కూడా తీశారు. ఆ సాసర్ ఆకారంలో ఉన్న వస్తువులు ఏంటో శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించుకోలేకపోవడంతో వాటికి అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ (యూఎఫ్ఓ) గా నామకరణం చేశారు. ఇప్పుడీ యూఎఫ్ఓగా భావిస్తున్న ఓ ఎగిరే పళ్లాన్ని కాన్పూర్ లో అభిజిత్ అనే బాలుడు స్మార్ట్ ఫోన్ కెమేరాలో బంధించాడు. మేఘాలను ఫొటో తీసేందుకు యత్నించిన ఆ బాలుడు యూఎఫ్ఓ కనిపించడంతో దాన్ని ఫొటోలు తీశాడు. కాన్పూర్ లోని శ్యామ్ నగర్ కాలనీలో బుధవారం జరిగిందీ ఘటన. దీనిపై అభిజిత్ తండ్రి సంతోష్ గుప్తా మాట్లాడుతూ... తన కుమారుడు తీసిన ఫొటోలను సైంటిస్టులు పరీక్షించాలని కోరారు.