: రికార్డ్ కోసం ముక్కులో మేకులు గుచ్చుకున్న వైనం!
కాదేదీ కవితకు అనర్హమన్నట్టు... రికార్డుల కోసం కూడా కొందరు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ కోవలో తాజాగా ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. ఈ విషయంలో తనను తాను కష్టపెట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు తన ముక్కులో మేకులు దించుకుని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని లిబర్టీ మీడియా సెంటర్ లో నిర్వహించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వేదికైంది. ముక్కులో చిన్న సమస్య వస్తేనే చాలా ఇబ్బందిపడతాం. అలాంటిది మేకులు గుచ్చుకోవడమంటే మాటలు కాదు. క్రాంతికుమార్ అనే యువకుడు ఇలా చేసి కార్యక్రమానికి హాజరైన వారి నుంచి అభినందనలు అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సదరు యువకుడు చోటు దక్కించుకున్నాడు. ఇందుకు గుర్తింపుగా రికార్డ్స్ కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను క్రాంతికి ఆ సంస్థ ప్రతినిధులు గోపాల్ రెడ్డి, నరేందర్, స్వర్ణశ్రీలు అందజేశారు.