: 'కేఎఫ్ సీ' ఆహార పదార్థాల్లో ఈ-కొలి, సాలంనెల్లా బ్యాక్టీరియాలు!
మన దేశంలో అమెరికాకు చెందిన కేఎఫ్ సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) అన్ని నగరాల్లో విస్తరిస్తూ, వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా పెంచుకుంటోంది. నగరాల్లో కేఎఫ్ సీకి చెందిన ఏ షాప్ చూసినా, కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. నోరూరించే ఆహార పదార్థాలు, రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడంలో కేఎఫ్ సీ స్టైలే వేరు. అయితే, ఈ బహుళజాతి సంస్థ అందిస్తున్న ఆహార పదార్థాలు చిన్నారుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని బాలల హక్కుల సంఘం ఆరోపించింది. ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన ఈ-కొలి, సాలంనెల్లా లాంటి బ్యాక్టీరియాలున్నాయని మండిపడింది. వెంటనే కేఎఫ్ సీని నిషేధించాలని, లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమని హెచ్చరించింది. అమెరికాలాంటి దేశాల్లో వారు తినని పదార్థాలను ఇక్కడకు డంప్ చేసి, మనకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల భవిష్యత్తు కోసం మ్యాగీ నూడుల్స్ ను ఏవిధంగా నిషేధించారో... కేఎఫ్ సీ విషయంలో కూడా అలానే చేయాలని డిమాండ్ చేసింది. వారం రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.