: 'తెలుగు కొట్లాట'పై కేంద్రం ప్రేక్షక పాత్ర!
ఆంధ్రప్రదేశ్ విడిపోయి సంవత్సరం దాటినా రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలు పుట్టుకొచ్చి చిలికి చిలికి గాలివానలా మారుతూనే ఉన్నాయి. పరిస్థితులు నానాటికీ దిగజారడానికి కేంద్రం వైఖరే కారణమని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ, చట్టాన్ని చేసిన కేంద్రం, దాని అమలును పర్యవేక్షించకపోవడమే తెలుగు రాష్ట్రాల మధ్య అగాధాన్ని పెంచేలా చేసింది. గత సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలుత ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆపై లోకల్, నాన్ లోకల్ వివాదాలు, ఐఏఎస్ ల పోస్టింగ్, వాహనాల రిజిస్ట్రేషన్, ఉద్యోగుల రిలీవ్, ఆర్టీసీ విభజన... ఇలా ఎన్నో అంశాల్లో వివాదాలు ఏర్పడితే, ఒక్కదాన్లోనూ కేంద్రం కల్పించుకోలేదు. కొన్ని సమస్యలు కోర్టు జోక్యంతో పరిష్కారం కాగా, మరికొన్ని అలాగే నలుగుతున్నాయి. తాజాగా సెక్షన్ 8 అమలు విషయంలో తలెత్తిన వివాదంపైనా కేంద్రం ప్రేక్షకపాత్రకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. హోం శాఖ ఆధ్వర్యంలో ఒక్కసారన్నా ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి కూర్చోబెట్టి చర్చించకపోగా, 8వ సెక్షన్ పై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పకుండా దాటవేస్తూ వస్తోంది. వివాదానికి మూలాలను కనుగొని తప్పెవరిదో తేల్చాల్సిన బాధ్యతను హోం శాఖ ఎంతమాత్రమూ నిర్వర్తించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వివాదాలు పెరిగి ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలపై ప్రభావం పడి పరిస్థితి మరిత దిగజారకముందే కేంద్రం మౌనాన్ని వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.