: అద్వానీకి మరోమారు అవమానం... ‘ఎమర్జెన్సీ’ కార్యక్రమానికి అందని ఆహ్వానం
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి అవమానాల పరంపర ఎదురవుతూనే ఉంది. పార్టీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం పెరిగిన నేపథ్యంలో పలు సందర్భాల్లో అద్వానీకి అంతగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో అద్వానీ పలుమార్లు అలిగిన సందర్భాలూ మనకు తెలిసిందే. తాజాగా నిన్న అద్వానీని ఆయన సొంత పార్టీ మరోమారు అవమానించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ అమలై 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ అనుబంధ సంస్థ 'శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశోధనా సంస్థ' నిన్న ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అద్వానీ కనిపించలేదు. ఈ కార్యక్రమానికి అద్వానీకి ఆహ్వానం అందలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమర్జెన్సీపై అద్వానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు పార్టీ ఆహ్వానం పంపలేదన్న వాదన వినిపిస్తోంది. అయితే నిన్నటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించేందుకు నిరాకరించారు.