: ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆంక్షలు... గవర్నర్ ఆదేశాలతో భద్రత కట్టుదిట్టం
ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిన్న సాయంత్రం నుంచి ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రధాన ద్వారం నుంచి ప్రముఖులు బస చేసే శబరి బ్లాక్ తదితరాల వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియాకైతే అసలు ఆ పరిసరాల్లోనే కనిపించవద్దని పోలీసులు తెగేసి చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదేశాల మేరకే అక్కడి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోం శాఖ పిలుపుతో నిన్న సాయంత్రం ఉన్నపళంగా హైదరాబాదు నుంచి వచ్చిన గవర్నర్ ఏపీ భవన్ లోని శబరి బ్లాకులో విడిది చేశారు. తన అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ తన వద్దకు పంపరాదని గవర్నర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారట. అంతేకాక భవన్ లో మీడియా హడావిడి లేకుండా జాగ్రత్త పడాలని కూడా ఆయన సూచించారట. దీంతో పోలీసులు ఏపీ భవన్ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని కూడా శబరి బ్లాకు పరిసరాలకు అనుమతించడం లేదు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ముగిసేదాకా అక్కడ ఆంక్షలు కొనసాగనున్నాయి.