: చంద్రబాబులానే పవన్ కల్యాణ్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారు: వైసీపీ నేత ద్వారంపూడి
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రావు విమర్శించారు. సీఎం చంద్రబాబు ఏవిధంగా మోసం చేస్తున్నారో ఆయన కూడా అలానే చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. కాకినాడ ధర్నాలో ద్వారంపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతిపై ప్రశ్నిస్తానన్న పవన్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు నిలదీయడం లేదన్నారు. కనీసం ప్రజలకు కనిపించకుండా ఏసీ గదుల్లో కూర్చుని ముఖానికి రంగులేసుకుని పవన్ నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్కడ కాకుండా ప్రజల్లోకి వస్తే సమస్యలు అర్థం అవుతాయన్నారు.