: మంత్రిగారి గేదెల దొంగ దొరికాడోచ్....!
యూపీ మంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అజాం ఖాన్ గేదెలను దొంగిలించిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. పోయిన ఏడాది జనవరి 31న అజాం ఖాన్ కు చెందిన ఏడు గేదెలను ఆయన ఫాం హౌస్ నుంచి దొంగిలించారు. దీనిపై అజాం ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత గేదెలను పోలీసులు కనిపెట్టారు కానీ, దొంగలను మాత్రం పట్టుకోలేక పోయారు. చివరకు, దొంగల్లో ఒకడైన చునాన్ ను ఇటీవలే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. చునాన్ ఇచ్చిన సమాచారం మేరకు, ఈ దొంగతనంలో మొత్తం ఐదుగురు పాలుపంచుకున్నట్టు తేలింది. ముగ్గురు దొంగతనానికి ప్లాన్ వేయగా... మరో ఇద్దరు గేదెలను అక్కడ నుంచి తరలించారు. ఇప్పుడు చునాన్ ఇచ్చిన సమాచారంతో, మిగిలిన దొంగలను కూడా పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరో విషయం ఏమిటంటే, గేదెల దొంగలను కనిపెట్టే పనిలో పోలీసులు చాలా బాధలు అనుభవించారు. మంత్రి గారి ఆదేశాలతో వారు తీరిక లేకుండా దొంగల కోసం తిరిగారు. ఈ క్రమంలో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు కూడా.