: అమెరికా అధ్యక్షుడికి కోపమొస్తే...!
అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చింది. తాను మాట్లాడుతుంటే పదేపదే అడ్డు తగులుతున్న ఓ వ్యక్తిని బయటకు గెంటేయమని ఆదేశించారు. అసలు విషయం ఏంటంటే... వైట్ హౌస్ లో జరిగే ఏ కార్యక్రమానికైనా, బయటి నుంచి అతిథులు వచ్చినప్పుడు, వారు అధ్యక్షుడు ఒబామాను చూడగానే హర్షాతిరేకాలతో స్వాగతం పలుకుతారు. ఆయన మాట్లాడుతుంటే చప్పట్లతో ప్రోత్సహిస్తారు. కానీ, ఈ దఫా అలా జరగలేదు. 'ఎల్ జీబీటీ ప్రైడ్ మంత్' వేడుకలు వైట్ హౌస్ లోని ఈస్ట్ రూంలో జరిగాయి. ఒబామా ప్రసంగిస్తుంటే, ఓ ఆహూతుడు పదే పదే బిగ్గరగా అరుస్తూ, ఆటంకం కలిగిస్తున్నాడు. ఒకదశలో అసహనంతో "విను... నువ్వు నా ఇంట్లో ఉన్నావు" అని ఒబామా వేలుచూపి హెచ్చరించడం కనిపించింది. అయినప్పటికీ వెనక్కు తగ్గని ఆ వ్యక్తి ఇంగ్లీషుతో పాటు స్పానిష్ భాషలోనూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. ఇంకో నిమిషం తరువాత "నీకు తెలుసు, ఇది గౌరవం కాదు. ఇలా పదే పదే అడ్డుతగులుతుంటే, నా నుంచి సరైన స్పందన కూడా పొందలేవు" అన్నారు. ఆపై పరిస్థితి సద్దుమణగక పోగా, "సిగ్గుండాలి. నువ్విలా చెయ్యకూడదు, ఇతన్ని బయటకు గెంటేయండి" అని కోపంగా అన్నారు. మిగతావారంతా "ఒ-బా-మా... ఒ-బా-మా" అని నినాదాలు చేస్తుంటే కాస్తంత శాంతించిన ఆయన "సాధారణంగా ఎవరైనా అడ్డుతగులుతుంటే నేను ఓర్చుకుంటాను. కానీ వైట్ హౌస్ లో ఉన్నప్పుడు మాత్రం కాదు సుమా" అని ఓ జోకేసి తన ప్రసంగంలోకి వెళ్లిపోయారు.