: కేశినేని బస్సులో సంచి... సంచిలో 5.5 కిలోల బంగారం... ఎత్తుకెళ్లిన దొంగలు!


నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై నేటి ఉదయం భారీ చోరీ జరిగింది. హైదరాబాదు నుంచి చెన్నై బయలుదేరిన బస్సులో జరిగిన ఈ చోరీపై ఫిర్యాదు అందుకున్న నాయుడుపేట పోలీసులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే, బస్సులో చోరీకి గురైన సంచిలో 5.5 కిలోల బంగారం ఉందట. వివరాల్లోకెళితే... కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు నిండా ప్రయాణికులతో హైదరాబాదు నుంచి చెన్నైకి నిన్న రాత్రి బయలుదేరింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద విరామం కోసం ఆగిన బస్సు తిరిగి బయలుదేరే సమయంలో అందులోని ఇద్దరు ప్రయాణికులు తమ సంచి ఒకటి కనిపించడం లేదని గుర్తించారు. వారి ఫిర్యాదుతో బస్సు మరోమారు నిలిచిపోయింది. బస్సంతా వెతికినా సదరు సంచి దొరకలేదు. దీంతో ఆ సంచిలో ఏమున్నాయని బస్సు సిబ్బంది రెట్టించి అడగడంతో అందులో 5.5 కిలోల బంగారం ఉందంటూ సదరు వ్యక్తులు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన బస్సు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయమని వారికి తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సదరు ప్రయాణికులు బంగారం ఉన్న తమ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారు. అంత భారీ స్థాయిలో బంగారం తరలించేటప్పుడు ఏమాత్రం జాగ్రత్త లేకుండా ఎలా వస్తారంటూ పోలీసులు సంధించిన ప్రశ్నలకు వారి నోట నుంచి మాట రాలేదట. ఇక బాధితుల విషయానికొస్తే... చెన్నైలోని భాగ్యం నగల దుకాణంలో వారు పనిచేస్తున్నారట. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News