: డిమాండ్లు ఒప్పుకునేదాకా దిగిరామంటున్న లారీ ఓనర్లు... మరోసారి చర్చలన్న టీ సర్కారు
తెలంగాణలో లారీ ఓనర్ల సమ్మె నేటితో రెండో రోజుకు చేరుకుంది. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిత్యావసరాల రవాణాకు ఆటంకం కలిగించమని లారీ ఓనర్లు చెబుతున్నా, వివిధ ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా రాష్ట్రానికి తరలివచ్చిన సరుకులను మార్కెట్లకు తరలించేందుకు లారీలు రాలేదు. దీంతో ఎక్కడి నిత్యావసరాలు అక్కడే వుండిపోయాయి. ఏపీలోకి వెళ్లే లారీలకు సింగిల్ స్టేట్ పర్మిట్ తో పాటు ట్యాక్స్ ను పది జిల్లాల ప్రాతిపదికగా తగ్గించాలన్న తమ డిమాండ్లకు ఆమోద ముద్ర పడేదాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదని లారీ ఓనర్లు చెబుతున్నారు. పరిస్థితి మరింత విషమించకముందే సమ్మెను విరమింపజేసేందుకు తెలంగాణ సర్కారు మరో మెట్టు దిగింది. మరోమారు చర్చలకు సిద్ధంగానే ఉన్నామని లారీ ఓనర్లకు సమాచారం పంపింది. సమస్య పరిష్కారం దిశగా లారీ ఓనర్లను ఒప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రవాణా మంత్రి మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.