: తెలుగు రాష్ట్రాల సీఎంలకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు...ఒక్కో బస్సు ఖరీదు రూ.5 కోట్లు!


ఇప్పటిదాకా బుల్లెట్ ప్రూఫ్ కార్లనే చూశాం. తాజాగా బుల్లెట్ ప్రూఫ్ రక్షణతో కూడిన బస్సులనూ చూడనున్నాం. అవి కూడా తెలుగు రాష్ట్రాలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు అత్యాధునిక వసతులతో పాటు బుల్లెట్ ప్రూఫ్ తో తయారైన ఈ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయట. చండీగఢ్ కు చెందిన జేసీబీఎల్ కంపెనీ ఆ రెండు బస్సులకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ బస్సులు నిప్పుకు లొంగవట. బుల్లెట్లకు ఏమాత్రం దెబ్బతినవట. అంతేకాదండోయ్, భారీ బ్లాస్టింగ్ లను కూడా తట్టుకుని నిలబడతాయట. ఈ బస్సుల తయారీకి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నాయట. కేసీఆర్ కోసం రూపొందుతున్న బస్సు రెండు, మూడు రోజుల్లో అందుబాటులో రానుండగా; చంద్రబాబు బస్సు వచ్చేందుకు కాస్తంత సమయం పడుతుందని సమాచారం. జిల్లాల పర్యటనల్లో భాగంగా ఇకపై ఇద్దరు సీఎంలు ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. సీఎంలతో పాటు వారి వ్యక్తిగత భద్రత సిబ్బంది, అధికారులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సుల్లో 17 నుంచి 20 వరకు అత్యాధునిక సీట్లు ఏర్పాటవుతున్నాయి. ముందూ, వెనుకకే కాక పక్కకు కూడా వంచుకునేందుకు వీలుగా ఈ సీట్లను తయారు చేస్తున్నారు. ఇక బాత్ రూం తరహా ఏర్పాట్లు కూడా ఈ బస్సుల్లో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణిస్తూనే చంద్రబాబు, కేసీఆర్ లు తమ రాష్ట్రాల పాలనా వ్యవహారాలను కూడా చక్కబెట్టుకునే వెసులుబాటు ఉంది. ఎందుకంటే, టెలివిజన్లతో పాటు శాటిలైట్ సౌకర్యాలు కూడా వీటిలో ఏర్పాటు కానున్నాయి.

  • Loading...

More Telugu News