: మాంసాహారాన్ని త్యజించిన రాజీవ్ గాంధీ హంతకుడు...ఆధ్యాత్మికవేత్తగా మారిన వైనం
సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనపై మానవ బాంబును ప్రయోగించి హత్య చేశారు. ఈ కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకడైన దోషి మురుగన్ ప్రస్తుతం వేలూరు జైల్లో వున్నాడు. గత కొంత కాలంగా మురుగన్ జీవన శైలే పూర్తిగా మారిపోయిందట. కరుడుగట్టిన మనస్తత్వానికి స్వస్తి చెప్పిన మురుగన్, పక్కా ఆధ్యాత్మికవేత్తగా మారిపోయాడు. వారంలో మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో దీక్షలో ఉంటున్న మురుగన్ నిత్యం కాషాయ వస్త్రాల్లో కనిపిస్తున్నాడు. మాంసాహారాన్ని పూర్తిగా త్యజించిన అతడు, అక్కడి మహిళా జైల్లోనే ఉంటున్న తన భార్య నళినిని కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదట. దీక్షల్లో ఉంటున్న నాలుగు రోజులు ఎలాంటి ఆహారం తీసుకోని అతడు కేవలం అరటిపండుతోనే సరిపెడుతున్నాడు. ఏడాదిగా ఆధ్యాత్మికత బాట పట్టిన మురుగన్ జైల్లో తోటి ఖైదీలతోనూ మాటలు తగ్గించేశాడని వేలూరు జైలు అధికారులు చెబుతున్నారు.