: ముస్తాఫిజూర్ ను సానబట్టింది మనవాడే!


బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ పాలిట యమకింకరుడిలా పరిణమించిన యువ లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నాడు. భారత్ తో సిరీస్ ద్వారా వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన ఈ పందొమ్మిదేళ్ల కుర్రాడు తన పదునైన బౌలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యర్థులను బెంబేలెత్తించే వేగం లేకపోయినా, టెక్నిక్ కు కచ్చితత్వం జోడించి వికెట్లు రాబట్టాడీ బక్క పలుచని పేసర్. తొలి మ్యాచ్ లో 5 వికెట్లు, రెండో మ్యాచ్ లో 6 వికెట్లు, చివరి మ్యాచ్ లో 2 వికెట్లతో సత్తా చాటాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ వంటి జట్టుపై, అదీ ఓ కొత్త కుర్రాడు ఈ స్థాయి ప్రదర్శన కనబర్చడం మామూలు విషయం కాదు. అయితే, ముస్తాఫిజూర్ ప్రస్థానంలో ఓ భారతీయుడి పాత్ర ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అతడి పేరు రణదేబ్ బోస్. బెంగాల్ మాజీ క్రికెటర్. దేశవాళీ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న ఈ పొడగరి రెండేళ్లపాటు బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కోచ్ గా సేవలందించాడు. యువ ఫాస్ట్ బౌలర్లను గుర్తించి వారికి సానబట్టడం బోస్ కు అప్పగించిన విధుల్లో ప్రధానమైనది. అలా వెదుకుతుండగా, బోస్ కంట్లో పడ్డాడు ముస్తాఫిజూర్. అప్పటికి 17 ఏళ్ల కుర్రాడైన ముస్తాఫిజూర్ చాలా బలహీనంగా కనిపించాడు బోస్ కంటికి. గ్రామీణ ప్రాంతం నుంచి రావడం , పైగా, పేద కుటుంబానికి చెందినవాడు కావడంతో అతడు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించాడు. అలాంటి ఫిట్ నెస్ తో కనీసం బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు కూడా ఆడలేడేమోనని భావించాడట బోస్. అయితే, రెండు నెలల్లోనే కోచ్ భావన తప్పని నిరూపించాడు ముస్తాఫిజూర్. కఠోర పరిశ్రమ, బౌలింగ్ పట్ల తపన కనబర్చి బోస్ ను ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి మొదలైంది ముస్తాఫిజూర్ కు సిసలైన శిక్షణ. బోస్ తనకు తెలిసిన కిటుకులన్నీ ఆ యువకుడికి నేర్పించాడు. ఎక్కడ బంతిని పిచ్ చేయాలి? స్వింగ్ బౌలింగ్ లో వైవిధ్యం ఎలా ప్రదర్శించాలి? బ్యాట్స్ మెన్ ను ఎలా బోల్తా కొట్టించాలి? ఫాస్ట్ రనప్ తో స్లో డెలివరీ సంధించడం ఎలా?... ఇలాంటివన్నీ నేర్పించి, సాధన చేయించి, మట్టిలో మాణిక్యానికి మెరుగులు దిద్దాడు. తన శిష్యుడు ఇప్పుడు టీమిండియాపై అమోఘమైన రీతిలో బౌలింగ్ చేయడం పట్ల బోస్ పొంగిపోతున్నాడు. ముస్తాఫిజూర్ ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతూ... అతడికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ ఎంత ఆడితే అంత రాటుదేలతాడని అభిప్రాయపడ్డాడు. "శిక్షణ సమయంలో, ఏం చెబితే దాన్ని నెట్స్ లో ఆచరించేవాడు. అలా నన్ను అక్కడికక్కడే ఆకట్టుకునేవాడు" అని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా, ముస్తాఫిజూర్ సంధించే స్లో డెలివరీ చాలా ప్రమాదకరమని బోస్ అన్నాడు. ఉపఖండం పిచ్ లపై ఆ బంతి ఎంతో నష్టం కలిగిస్తుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News