: రైనా ఆల్ రౌండ్ షో...పరువు దక్కించుకున్న టీమిండియా
టీమిండియా ఎట్టకేలకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. వన్డే సిరీస్ ఓడిపోయినా క్లీన్ స్వీప్ కాకుండా టీమిండియా ఆటగాళ్లు అడ్డుకున్నారు. దీంతో రెండు, ఒకటి తేడాతో టీమిండియా సిరీస్ పరాజయం మూటగట్టుకుంది. భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్ లో రాణించి సత్తాచాటారు. రైనా ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకోగా, బ్యాట్స్ మన్, బౌలర్లు కలసి కట్టుగా రాణించి చివరి వన్డేలో విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, ధావన్ (75), రోహిత్ (29), కోహ్లీ (25), ధోనీ (69), రాయుడు (44), రైనా (39), బిన్నీ (10), అక్షర్ పటేల్ (10) లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. అనంతరం 318 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా ఆటగాళ్లను టీమిండియా బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఓపెనర్లిద్దరినీ ధావల్ కులకర్ణి పెవిలియన్ బాట పట్టించగా, మూడు వికెట్లతో రైనా చుక్కలు చూపించాడు. అశ్విన్ రెండు వికెట్లు తీసి బంగ్లా బ్యాట్స్ మన్ దూకుడుకు కళ్లెం వేశాడు. అక్షర పటేల్, స్టువర్ట్ బిన్నీ, అంబటి రాయుడు చెరో వికెట్ తో రాణించారు. టీమిండియా బౌలర్ల ధాటికి తమీమ్ ఇక్బాల్ (5), మొర్తజా(0), రూబెల్ హుస్సేన్ (2), విఫలమవగా, సౌమ్య సర్కార్ (40), లిట్టన్ దాస్ (34), ముస్తాఫిజుర్ రహీమ్ (24), షకిబ్ అల్ హసన్ (20), షబ్బీర్ రహీమ్ (43), నాసిర్ హోసైన్ (32) అరాఫత్ సన్నీ (14), ముస్తాఫిజురు రెహమాన్ (9) రాణించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 47 ఓవర్లలో 240 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.