: ఆమెది 200 కోట్ల కుంభకోణం...ఆధారాలున్నాయి: మహారాష్ట్ర మంత్రిపై కాంగ్రెస్ ఆరోపణలు
మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే 200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పాఠశాలలకు సంబంధించిన వస్తువుల కొనుగోలులో ఆమె కనీస ప్రమాణాలు పాటించలేదని, తద్వారా ఆమె 200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. కాగా, టెండర్ పద్ధతిలోనే పనులు కేటాయించారని, లక్ష రూపాయలు పైబడిన ప్రతి వస్తువు కొనుగోలు టెండర్ పద్ధతిలో సాగాలని నిబంధన ఉన్నట్టు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్ తివార్ తెలిపారు. కాగా, దీనిపై మంత్రి పంకజ ముండే స్పందిస్తూ, కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు జరిగినట్టు స్పష్టం చేశారు. అప్పట్లో ఆన్ లైన్ టెండర్ విధానం అమలులో లేనందున ఆన్ లైన్ లో జరగలేదని ఆమె తెలిపారు. కాగా, పంకజ ముండే బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె.