: మరో టైటిల్ కోసం ఉరకలు వేస్తున్న సానియా
ఇటీవల కాలంలో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా డబుల్స్ విభాగంలో దూసుకెళుతోంది. మార్టినా హింగిస్ తో జత కలిశాక సానియా ఖాతాలో పలు టైటిళ్లు చేరాయి. దాంతో, సానియా మహిళల డబుల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ గా అవతరించింది. తాజాగా, తన జోరును ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలోనూ ప్రదర్శిస్తోంది. సానియా-హింగిస్ జోడీ 6-0, 6-2తో కరోలినా ప్లిస్కోవా, మిచెల్లా క్రాయిసెక్ ద్వయంపై అలవోకగా నెగ్గి క్వార్టర్స్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ చింగ్ చాన్-ఫ్లావియా పెనెట్టా జోడీతో తలపడనుంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ చాంపియన్ షిప్ కు ముందు జరిగే సన్నాహక టోర్నీల్లో ఏగాన్ టోర్నీయే చివరిది. దీంతో, ఇక్కడి గ్రాస్ కోర్టుపై టైటిల్ నెగ్గడం ద్వారా ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకోవాలని సానియా, హింగిస్ భావిస్తున్నారు.