: డబ్బు కష్టాలా?... 'ఓడీ' గురించి తెలుసుకున్నారా?
ప్రతి ఒక్కరికీ, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో డబ్బు కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ టైమ్ లో అప్పులు చేసి లేదా నగలు, ఆస్తులు తాకట్టు పెట్టి కష్టాల నుంచి గట్టెక్కుతుంటాం. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కలిగిన వేళ, వాటి నుంచి సులువుగా బయటపడేందుకు ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకు శాఖ సహకరిస్తుందని చాలా మందికి తెలీదు. అదే ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యం. ఓడీ గురించి తెలుసుకుందాం.. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే, బ్యాంకుతో చేసుకునే రుణ ఒప్పందం. ఓ ఖాతాదారుడి ఖాతాలో ఉన్న నగదు కన్నా ఎక్కువ విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని తమ విచక్షణాధికారం మేరకు బ్యాంకు అధికారులు కల్పిస్తుంటారు. ఏ మేరకు అధిక విత్ డ్రా సౌకర్యం కల్పిస్తారన్న విషయంలో నిర్ణయాధికారం బ్యాంకుదే. మీ ఖాతా నిర్వహణ, వేతన ఎకౌంటయితే, నెలసరి వేతనం, దాన్ని విత్ డ్రా చేసుకునే తీరు, బ్యాంకులో మీ పేరిట ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు, షేర్లు, బాండ్లు తదితరాల మొత్తం ఏ మేరకు ఉందన్న విషయంపై ఆధారపడి ఓడీ మొత్తం మారుతుంటుంది. దీనిపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ నామమాత్రంగానే ఉంటుంది. నెల మధ్యలో ఓడీ తీసుకుని వేతనం పడగానే, దాన్ని ఖాతా నుంచి కట్ చేసుకునేట్లయితే, కొన్ని బ్యాంకులు ఏ మాత్రం వడ్డీని వసూలు చేయడం లేదు. కొన్నిసార్లు ఓడీ తీసుకున్నాక కూడా ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్ డ్రా చేయకుంటే, తీసుకున్న సొమ్ముకు మాత్రమే వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. వ్యక్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు, అత్యవసరంగా డబ్బు అవసరమైన వారిని ఈ సదుపాయం ఎంతో ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. అయితే, తీసుకున్న మొత్తాన్ని నెలలోగా బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి వుంటుందన్న విషయాన్ని మాత్రం మరువకండి. ఒకవేళ తిరిగి చెల్లింపు ఆలస్యమైతే, మరోసారి ఓడీ కావాలని వెళ్లినప్పుడు తిరస్కరణకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.