: కేసీఆర్ కాచుకో...హైదరాబాదును యూటీ చేసేందుకు ఉద్యమిస్తాం: అచ్చెన్నాయుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై ఆందోళణకు దిగితే, హైదరాబాదును యూటీ చేయాలని తాము కూడా ఆందోళన నిర్వహిస్తామని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, హైదరాబాదుపై రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. పదేళ్లకు పది నిమిషాల ముందు కూడా హైదరాబాదును ఖాళీ చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ ఎంసీ, ప్రభుత్వ సంస్థలపై గవర్నర్ నరసింహన్ బాధ్యతలు తీసుకోని పక్షంలో, తాము సమాంతర పాలన సాగిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేసీఆర్ విభజన చట్టాన్ని అనుసరించనని వ్యాఖ్యానించడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన చెప్పారు. కేసులు మాఫీ చేయించుకునేందుకు కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్ ను ప్రజలు రాళ్లతో కొడతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సెక్షన్లు 5, 8 అమలు చేయనంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ తక్షణం బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.