: నాడు తమను కాపాడిన అడవుల కోసం చంబల్ మాజీ బందిపోటు దొంగల నేటి ఉద్యమం
సీమా పరిహార్, గబ్బర్ సింగ్, మోహర్ సింగ్, సారూ సింగ్, రేణూ యాదవ్, సరళా యాదవ్... వీరంతా ఒకప్పుడు చంబల్ లోయను గడగడలాడించిన బందిపోటు దొంగలు. ఎన్నో దోపిడీలు చేసిన వారు. తమ దుశ్చర్యలతో పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచిన వారు. కానీ, ఇప్పుడు మారిపోయారు. ఆయుధాలు పక్కన పడేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి మంచివారిగా మిగిలారు. అంతేకాదు, నలుగురికీ ఆదర్శవంతంగా నిలిచేలా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఒకప్పుడు తమకు ఆశ్రయమిచ్చి కాపాడిన చంబల్ అడవుల పరిరక్షణకు ముందుకు కదిలారు. వచ్చే నెలలో 'మహాకుంభ' పేరిట ప్రత్యేక వన సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'పెహలే బసాయా బిహాద్ - అబ్ బచాయేంగే బిహాద్' (ఒకప్పుడు మేము అడవుల్లో నివసించాం - ఇప్పుడు అడవులను కాపాడతాం) అనే నినాదంతో ప్రజలు, అధికారుల్లో చైతన్యం తేవాలని ప్రయత్నిస్తున్నారు. వీరు చేపట్టిన కార్యక్రమానికి ఇప్పుడు మంచి మద్దతు లభిస్తోంది.