: మరిన్ని చిక్కుల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ తన విద్యార్హతల విషయమై మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన ఓ పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి స్మృతి ఇరానీకి సమన్లు జారీచేసేందుకు తగ్గ సాక్ష్యాధారాలు, ఇతర వివరాలను ఆగస్టు 28న రికార్డు చేయాలని మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు, రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన రెండు సందర్భాల్లోను స్మృతి వేరువేరు విద్యార్హతలను చూపారని అహ్మర్ ఖాన్ అనే రచయిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, తప్పుడు విద్యార్హత పత్రాలు సమర్పించిన కేసులో ఢిల్లీ మంత్రి తోమర్ ఇప్పటికే పదవిని పోగొట్టుకుని జైల్లో కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక స్మృతి ఇరానీ విద్యార్హతల విషయమై తప్పు జరిగినట్టు తేలితే, ఆమె కూడా మంత్రి పదవిని వదులుకోవాల్సి రావచ్చు.