: ఇంటర్నెట్ బిల్లులపై డబ్బు ఆదా చెయ్యాలంటే...!


ఇంటర్నెట్ వాడకుండానే బిల్లు పెరిగిపోతోంది... ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న ఫిర్యాదుల్లో ఇదొకటి. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, వైఫై కనెక్షన్... ఇలా పలు రకాల డివైజ్ లను వాడటం కారణంగా, ఎందులో ఎంత డేటా వాడుతున్నారన్న విషయం అంత సులువుగా ట్రాక్ చేసుకోలేరు. ఇదే సమస్యగా మారుతోంది. బిల్లులను పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ బిల్లులను తగ్గించుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల సలహాలివి... బిల్లులు ఆదా చేసుకోవాలంటే తొలుత చెయ్యాల్సింది ఎంత ఇంటర్నెట్ వాడుతున్నాము? ఎంత డేటా కావాలి? అన్న విషయాలను తెలుసుకొని వుండాలి. మీరు డేటా ప్లాన్ వాడుతుంటే, డేటాను అధికంగా ఖర్చుచేసే యాప్స్ ను సులువుగానే నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. అంతకుమించి నెలసరి బిల్లులను 'డేటా లిమిట్' పెట్టుకోవడం ద్వారా ఎంత చెల్లించగలమో... అంత వరకూ తగ్గించుకోవచ్చు. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారైతే డేటా మానిటర్ తప్పకుండా ఉండి వుంటుంది. అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్ డేటా మానిటర్ సదుపాయాన్ని ముందుగానే లోడ్ చేసి అందిస్తున్నాయి. దీని ద్వారా ఏ యాప్ కు ఎంత డేటా అయిపోతోందో, ఒక్కో రోజులో, ఆఖరికి ఒక గంటలో ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు. ఒనావో కౌంట్ : అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో 'ఒనావో కౌంట్' పేరిట ఓ యాప్ అందుబాటులో ఉంది. దీనిలో తొలుత డేటా ప్లాన్, నెలవారీ రెంటర్ ఎమౌంట్ ను ఫీడ్ చేస్తే డేటా వాడకాన్ని నివేదికల రూపంలో ఎప్పటికప్పుడు అందిస్తుంది. దీంతో పాటు 'మై డేటా మేనేజర్' పేరిట మరో యాప్ కూడా మార్కెట్లో ఉంది. ఇందులో 3జి, వైఫై వాడకాన్ని పరిశీలిస్తూ ఉండవచ్చు. స్మార్ట్ ఫోన్ మాత్రమే కాకుండా, కంప్యూటర్, ఇంట్లో ఇతరులు వాడే ఫోన్ల వాడకాన్ని సైతం ఈ యాప్ తో నియంత్రించవచ్చు. డేటా అధికంగా వాడే సందర్భాల్లో సాధ్యమైనంత వరకూ వైఫై కనెక్షన్ కు మారడం అత్యుత్తమం. 3జిలో వీడియో చాటింగ్ కు అత్యధికంగా డేటా ఖర్చవుతుంది. సుమారు 30 నిమిషాల పాటు వీడియో చాటింగ్ చేస్తే 300 మెగాబైట్ల డేటా ఖర్చవుతుంది. దీంతో, చిన్న చిన్న ప్యాక్ లు తీసుకునే వారికి ఒక్క రోజులో ప్లాన్లోని డేటా మొత్తం అయిపోయినట్టే. ఏదైనా యాప్ అప్ డేట్ కావాలంటే కొన్ని వందల మెగాబైట్ల డేటా ఖర్చవుతుంది. కాబట్టి వీడియో చాట్, అప్ డేట్స్ సాధ్యమైనంత వరకూ వైఫై ఉన్న సమయంలో చేసుకుంటే మంచిది. ఇక పీసీల విషయానికి వస్తే 'నెట్ వర్క్స్' పేరిట విండోస్, 'మెనూ మ్యాటర్స్' పేరిట మాక్ సిస్టమ్స్ లో డేటా నియంత్రణ, వాడకంపై సమాచారమిచ్చే ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుతూ డేటాపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, కంట్రోల్ చేయడం ద్వారా బిల్లులను తగ్గించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News