: రోడ్డెక్కిన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ 'యుద్ధం'!
ఇండియాలో రెండు అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రోడ్డెక్కింది. గత వారంలో ఫ్లిప్ కార్ట్, తాను ప్రారంభించిన 'బిగ్ యాప్ షాపింగ్ డేస్' ప్రమోషన్ నిమిత్తం 'నహీ ఖరీదా? అచ్చా కియా' (కొనుగోలు చేయలేదా? మంచి పని చేశారు) అంటూ వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేసింది. ఇది ఓ రకంగా స్నాప్ డీల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యే అనడంలో సందేహం లేదు. దీనిపై స్నాప్ డీల్ కూడా స్పందించింది. 'అచ్చా కియా బతా దియా... యహాసే ఖరీదో' (మంచి సమాచారం ఇచ్చారు... ఇక్కడే కొనుగోలు చెయ్యండి) అని ప్రచారం మొదలుపెట్టింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఫ్లిప్ కార్ట్ ఎక్కడైతే హోర్డింగులు పెట్టిందో, వాటి పక్కన, కింద అంతకన్నా పెద్ద సైజు హోర్టింగులను స్నాప్ డీల్ పెట్టడంతో ఈ రెండు సంస్థల మధ్యా జరుగుతున్న ఆధిపత్య పోరు అందరికీ మరోసారి తెలిసొచ్చింది. ఈ యుద్ధం హోర్డింగులకే కాదు... చైర్మన్ స్థాయి అధికారుల మధ్యా మాటల రూపంలో కొనసాగుతోంది. స్నాప్ డీల్ సంస్థ ఉన్నతోద్యోగులను విదేశాల నుంచి తెచ్చుకుంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ లో వార్త ప్రచురితమైన తరువాత ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ స్పందిస్తూ, ఇండియాలో గొప్ప నైపుణ్యమున్న ఉద్యోగులను తీసుకోవడంలో పలు సంస్థలు విఫలమవుతున్నాయని పరోక్షంగా స్నాప్ డీల్ ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.