: లీటరుకు 250 కి.మీ. మైలేజీని ఇచ్చే కారు తయారీలో బీఎండబ్ల్యూ
అధికారిక లెక్కల ప్రకారం ఇండియాలో ఓ కారు అత్యధికంగా ఇచ్చే మైలేజీ లీటరుకు 27.62 కిలోమీటర్లు. కానీ, లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మాత్రం లీటరు ఇంధనంతో ఏకంగా 250 కి.మీ. ప్రయాణించే కారును అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. 'ఆటోమొబైల్ వోచ్' ప్రత్యేక కథనం ప్రకారం, 4 సీట్లుండే ఈ కారుకు కార్బన్ ఫైబర్ ప్లాస్టిక్ బాడీని అమర్చారని, బరువు 1200 కిలోల కన్నా తక్కువే ఉంటుందని తెలుస్తోంది. 2 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుందని, ఇది జనరేటర్ గా కూడా పనిచేస్తుందని, దీనికి అదనంగా మరో ఎలక్ట్రిక్ మోటారు సాయంతో కారు నడుస్తుందని సమాచారం. కాగా, ఇప్పటికే వోక్స్ వాగన్ సంస్థ ఎక్స్ ఎల్1 పేరిట డీజిల్/ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కారును తయారు చేసి లీటరుకు 111 కి.మీ మైలేజీని సాధించిన సంగతి తెలిసిందే.