: ఫ్రాన్స్ అధ్యక్షులపై అమెరికా గూఢచర్యం... సంచలనం సృష్టిస్తున్న వికీలీక్స్ తాజా ప్రకటన
అమెరికాకు చెందిన సెక్యూరిటీ ఏజన్సీలు ఫ్రాన్స్ అధ్యక్షులపై గూఢచర్యం చేశాయని వికీలీక్స్ తాజా ప్రకటన వెలువరించింది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్ నివేదికలు, టెక్నికల్ డాక్యుమెంట్ల వివరాలను అనుసరించి ఫ్రాన్స్ అధ్యక్షులుగా పనిచేసిన నికోలస్ సర్కోజీ, జాక్వెస్ చిరాక్ లతో పాటు, ఫ్రాంకోయిస్ హొలాండేపైనా అమెరికా నిఘా కొనసాగిందని తెలిపింది. 2006 నుంచి 2012 వరకూ ఎన్ఎస్ఏ గూఢచర్యం సాగిందని తెలిపింది. అధ్యక్షులతో పాటు క్యాబినెట్ మంత్రులు, అమెరికాలో ఫ్రాన్స్ దౌత్యవేత్తలపైనా నిఘా ఉందని వివరించింది. ఈ డాక్యుమెంట్లలో ప్రజాప్రతినిధులు, అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు, అధ్యక్షుల డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ఉన్నాయని, ఆర్థికమాంద్యం సమయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం వివిధ దేశాలతో జరిపిన సంభాషణల వివరాలున్నాయని పేర్కొంది. వికీలీక్స్ విడుదల చేసిన ఈ ప్రకటన సంచలనం కలిగిస్తుండగా, అవన్నీ ఊహాగానాలేనంటూ అమెరికా కొట్టి పారేసింది.