: లారీ ఓనర్లతో టీ సర్కారు చర్చలు విఫలం...ఎక్కడికక్కడ నిలిచిపోయిన 3.7 లక్షల లారీలు
తెలంగాణలో లారీ ఓనర్ల సమ్మె గత అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి మొదలైంది. లారీ ఓనర్లతో చర్చించి సమ్మెను విరమింపజేయాలన్న కేసీఆర్ సర్కారు యత్నం ఫలించలేదు. చర్చల్లో భాగంగా 23 జిల్లాల రాష్ట్రంలో ఉన్న పన్నును 10 జిల్లాల ప్రాతిపదికగా తగ్గించాలన్న లారీ ఓనర్ల డిమాండ్ కు ప్రభుత్వం ససేమిరా ఒప్పుకోలేదు. అంతేకాక ఏపీకి వెళ్లే లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్ కూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మె అనివార్యమని చెప్పిన లారీ ఓనర్లు వెనువెంటనే కార్యరంగంలోకి దిగారు. ఫలితంగా నేటి ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3.7 లక్షల లారీలు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలను రవాణా చేస్తున్న వాహనాలు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాలు నిలిచిపోయాయి.